Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, July 25, 2013

కొలొస్సయులకు1వఅధ్యాయము

  1-2. కొలొస్సైలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందువిశ్వాసులైన సహోదరులకు, దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలును సహోదరుడైన తిమొథెయును (శుభమని చెప్పి) వ్రాయునది. మన తండ్రియైన దేవునినుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. 
  3-4. పరలోకమందు మీకొరకు ఉంచబడిన నిరీక్షిత పదవినిబట్టి క్రీస్తుయేసునందు మీకు కలిగియున్న విశ్వాసమునుగూర్చియు, పరిశుద్ధులందరిమీద మీకున్న ప్రేమనుగూర్చియు, మేము విని యెల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు, మన ప్రభువగు యేసు క్రీస్తుయొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 
5  మీయొద్దకు వచ్చిన సువార్త సత్యమునుగూర్చిన బోధవలన (ఆ నిరీక్షిత పదవిని గూర్చి) మీరు ఇంతకుముందు వింటిరి. 
6  ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపనుగూర్చి విని సత్యముగా గ్రహించిన నాటనుండి మీలో సహితము (ఫలించుచు వ్యాపించుచున్నది ). 
7  ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసునివలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. 
8  అతడు మా విషయములోనమ్మకమైన క్రీస్తు వరిచారకుడు; అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. 
  9-12. అందుచేత ఈ సంగతి వినిననాటినుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతోకూడిన పూర్ణ ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలనుపాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు (దేవుని) బతిమాలుచున్నాను. 
13  ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునిరాజ్యనివాసులనుగా చేసెను. 
14  ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. 
15  ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. 
16  ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. 
17  ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. 
18  సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగునిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుట (విషయము) లోను ఆదిసంభూతుడుగా లేచినవాడు. 
  19-20. ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువ రక్తముచేత సంధిచేసి ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు (తండ్రి)కి అభీష్టమాయెను. 
21  మరియు గతకాలమందు దేవునికి దూరస్థులును, మీ దుష్ క్రియలవలన మీ మనస్సులో విరోధభావముగలవారునై యుండిన మిమ్మునుకూడ 
22  తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్ధోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. 
23  పునాదిమీద కట్టబడినవారై స్థిరముగాఉండి, మీరు విన్నట్టియు, ఆకాశముక్రింద ఉన్నసమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తనవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండినయెడల (ఇది మీకు కలుగును) పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. 
24  ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరముకొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. 
  25-26. దేవుని వాక్యమును, అనగా యుగములలోను తరములలోను మరుగుచేయబడియున్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు, మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని యేర్పాటుప్రకారము, నేను ఆ సంఘమునకు పరచారకుడనైతిని. 
27  అన్యజనులలో ఈ మర్మముయొక్క మహిమైశ్వర్యము ఎట్టదో అది, అనగా మీయందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణకు కారణమైయున్నాడనుసంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి యిప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. 
28  ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతిమనుష్యునికిని బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము. 
29  అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధికలుగజేయు ఆయన క్రియాశక్తినిబట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను
         Download Audio File

కొలొస్సయులకు2వఅధ్యాయము

 1-2. మీరును, లవొదికైయవారును, శరీరరీతిగా నాముఖము చూడకున్నవారందరును ప్రేమయుందు అతుడబడి, గ్రహించుచున్నామను సంపూర్ణ భాగ్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును స్పష్టముగా తెలిసికొన్నవారై, మీ హృదయములు ఆదరణపొందవలెనని మీ అందరికొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొన గోరుచున్నాను. 
3  బుద్ధి విజ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి. 
4  ఎవడైనను చక్కనిమాటలచేత మిమ్మును మోసపరచుకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. 
5  నేను శరీరవిషయములో దూరముగా ఉన్నను ఆత్మ విషయములో మీతోకూడ ఉండి మీ యోగ్యమైన ప్రవర్తననుక్రీస్తనందలి మీ స్థిరవిశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. 
6-8. కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, (యింటివలె) కట్టబడుచు, మీరు నేర్చుకొనినప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరములైన నిరర్థక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపచుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. 
9  ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు నివసించుచున్నది; 
10  మరియు ఆయనయందు మీరును సంపూర్ణులైయున్నారు; ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సైయున్నాడు; 
  11-12. మీరును బాప్తిస్మమందు ఆయనతోకూడ పాతి పెట్టబడినవారై ఆయనయందు సున్నతి పొందితిరి; ఆ సున్నతి చేతులతో చేయబడునది కాదుగాని శరీరేచ్ఛాయుక్తమైన స్వభావమును విసర్జించుటయను క్రీస్తుకు (అనుకూలమైన) సున్నతియే. ఆయనను మృతులలోనుండి లేపిన దేవుడు కనుపరచిన ప్రభావమందు విశ్వాసముంచుటచేత ఆ బాప్తిస్మమువలన ఆయనతో కూడ లేచితిరి. 
  13-15. మరియు అపరాధములవలనను, శరీరమందు సున్నతిపొందకయుండుటవలనను, మీరు మృతులైయుండగా దేవుడు విధిరూపకమైన ఆజ్ఞలవలన మనమీద రుణముగాను మనకు విరోధముగానుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డములేకుండ దానిని ఎత్తివేసి, మన అపరాధములనన్నిటిని క్షమించి ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను; ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా (వేడుకకు) కనుపరచెను. 
16  కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. 
17  ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజస్వరూపముక్రీస్తులో ఉన్నది. 
  18-19. అతి వినయాసక్తుడై దేవదూతారాధనయందు ఇచ్ఛకలిగి, తాను చూచిన వాటినిగూర్చిగొప్పగా చెప్పుకొనుచు, తన శరీరసంబంధమైన మనస్సువలన ఊరికె ఉప్పొంగుచు, శిరస్సును హత్తుకొననివాడెవడును మీ బహూమానమును అపహరింపనియ్యకుడి; ఆ శిరస్సుమూలముగా సర్వశరీరము కీళ్లచేతను నరములచేతను పోషింపబడి అతుకబడినదై దేవునివలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. 
  20-22. మీరు క్రీస్తుతోకూడ లోకముయొక్క మూలపాఠముల విషయమై మృతిపొందినవారైతే లోకములో బ్రదుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి - చేత పట్టుకొనవద్దు, రుచిచూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేల? అవన్నియు వాడుకొనుటచేత నశించిపోవును. 
23  అట్టివి స్వేచ్చారాధన విషయములోను జ్ఞానరూపకమైనవని యెంచబడుచున్నవేగాని, శరీరేచ్ఛానిగ్రహవిషయములో ఏమాత్రమును ఎన్నికచేయదగినవి కావు. 
       Download Audio File

కొలొస్సయులకు3వఅధ్యాయము

1  మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. 
  2-3. పైనున్నవాటిమీదనే గాని భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి; ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది. 
4  మనకు జీవమైయున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. 
5  కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షనుచంపివేయుడి. 
6  వాటివలన దేవుని ఉగ్రత అవిధేయులమీదికివచ్చును. 
7  పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకొంటిరి. 
8  ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి. 
  9-10. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి; ఏలయనగా ప్రాచీనస్వభావమునుదాని క్రియలతో కూడ మీరు పరిత్యజించి జ్ఞానము కలుగునిమిత్తము దాని సృష్టించినవాని పోలికెచొప్పున నూతనపరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొనియున్నారు. 
11  ఇట్టివారిలో హెల్లేనీయుడని యూదుడని భేదములేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదములేదు; పరదేశియని స్కూథాయుడనిదాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నావాడునై యున్నాడు. 
12  కాగా దేవుని చేత ఏర్పరచబడినవారును పరిశుద్ధలును ప్రియులునైనవారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. 
13  ఎవడైనను తనకు హాని చేసెనని యొకడనుకొనినయెడల ఒకని ఒకడు సహించుచు ఒకని ఒకడు క్షమించుడి, ప్రభువుమిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. 
14  వీటిన్నిటిపైని పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి 
15  క్రీస్తు (అనుగ్రహించు) సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి. 
16  సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధిచెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానముచేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి. 
17  మరియు మాటచేత గాని క్రియచేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయనపేరట చేయుడి. 
18  భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది. 
19  భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి. 
20  పిల్లలారా, అన్నివిషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనదగినది. 
21  తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. 
22  దాసులారా, మనుష్యులను సంతోషపెట్టువారైనట్టు కంటిక కనబడవలెననికాక, ప్రభువుకు భయపడుచు శుద్ధాంతఃకరణగలవారై, శరీరమునుబట్టి మీ యజమానులైనవారికి అన్నివిషయములలో విధేయులై యుండుడి. 
  23-24. ప్రభువువలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని యెరుగుదురుగనుక మీరేమిచేసినను అది మనుష్యుల నిమిత్తముకాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి; మీరు ప్రభువైన క్రీస్తుకు దాసులై యన్నారు. 
25  అన్యాయము చేసినవానికి తాను చేసిన అన్యాయము కొలది మరల లభించును, పక్షపాతముండదు. 
         Download Audio File

కొలొస్సయులకు4వఅధ్యాయము

1  యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని యెరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసులయెడల చేయుడి. 
 2-4. ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెళుకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మముగూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెననిమాకొరకు ప్రార్థించుడి. 
5  సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, (సంఘమునకు) వెలపటివారియెడల జ్ఞానముకలిగి నడుచుకొనుడి. 
6  ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి. 
7  ప్రియసహోదరుడును, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును, నా జతసేవకుడునైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నియు మీకు తెలియజేయును. 
  8-9. మీరు మా స్థితి తెలిసికొనునట్లును మీ హృదయములను అతడు ఆదరించునట్లును అతనిని అతనితో కూడ నమ్మకమైన ప్రియసహోదరుడైన ఒనేసిమును మీయొద్దకు పంపుచున్నాను; అతడు మీయొద్దనుండి వచ్చినవాడే; వీరిక్కడి సంగతులన్నియు మీకు తెలియజేతురు. 
10  నాతోకూడ చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీపజ్ఞాతియైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు; ఈ మార్కునుగూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీయొద్దకు వచ్చినయెడల ఇతని చేర్చుకొనుడి. 
11  మరియు యూస్తు అను యేసుకూడ మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందినవారిలో చేరినవారు, వీరుమాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జతపనివారై యున్నారు, వారివలన నాకు ఆదరణ కలిగెను. 
12  మీలో ఒకడును క్రీస్తుయేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు; మీరు సంపూర్ణులును, ప్రతివిషయములో దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ నిశ్చయతగలవారునై నిలుకడగా ఉండవలెనని యితడెల్లప్పుడును మీకొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. 
13  ఇతడు మీకొరకును, లవొదికైయవారికొరకును, హియెరపొలివారికొరకును బహు ప్రయాసపడుచున్నాడని యితనిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. 
14  లూకా అను ప్రియుడైన వైద్యుడును, దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. 
15  లవొదికైయలో ఉన్న సహోదరులకును సుంఫాకును, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. 
16  ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవొదికైయ వారి సంఘములోను చదివించుడి; లవొదికైయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి. 
17  మరియు - ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్తపడుమని అర్ఖిప్పుతో చెప్పుడి. 
18  పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయుచున్నాను; నా బంధకములను జ్ఞాపకము చేసికొనుడి. కృప మీకు తోడైయుండును గాక. 

        Download Audio File